తెలంగాణ · July 29, 2026

మాదాపూర్ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 29: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI)లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలోని మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధానాలు మరియు పోలీస్ సిబ్బంది రోజువారీ పనితీరును ఆయన సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలు అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని, ఆ దిశగా ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కట్టుబడి పనిచేయాలని ఆయన ఆదేశించారు.

మాదాపూర్ వంటి ప్రధాన ఐటీ కారిడార్ ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్ నిర్వహణ చేపట్టి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీపీ స్పష్టం చేశారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, కేస్ డైరీలు , రికార్డుల పక్కా నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు , ఫిర్యాదుదారులతో సత్ప్రవర్తనతో మెలుగుతూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపాలని, సిబ్బంది అంతా ఒక జట్టుగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అదేవిధంగా, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.

వాహనదారులతో సభస్యంగా, మర్యాదపూర్వకంగా , సంయమనంతో మాట్లాడుతూనే, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమగ్ర సమీక్షా కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, ట్రాఫిక్-I డీసీపీ రవికుమార్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు , సిబ్బంది పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor