ఆరోగ్యం · August 7, 2026

పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచాలి: స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 07: ప్రస్తుత సమాజంలో ఫోన్ జీవితంలో ఒక భాగమైనప్పటికీ దాని వాడకాన్ని అవసరాల వరకే పరిమితం చేసుకోవాలని, ముఖ్యంగా పసిపిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచాలని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి సూచించారు. హుజరాబాద్ పట్టణంలోని బ్రహ్మకుమారీస్ సెంటర్లో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్‌ను శుక్రవారం ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. నేటి తరం చిన్న పిల్లలు ఫోన్‌కు విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారని, దీనిని తల్లిదండ్రులు వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చిన్నతనంలోనే ఫోన్ చూడటం వల్ల పిల్లల మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడి, వారిలో సృజనాత్మకత నశిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణులు కూడా ఫోన్‌లకు దూరంగా ఉంటూ మంచి పుస్తకాలు చదవడం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం అలవాటు చేసుకుంటే పుట్టబోయే పిల్లలు జ్ఞానవంతులుగా జన్మిస్తారని తెలిపారు. సమాజంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అనంతరం సెంటర్ ఇన్చార్జ్ బికే శ్రీవాణి మాట్లాడుతూ.. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమాన్ని చేపట్టినట్లు వివరించారు. భారతదేశాన్ని మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ యోగ జీవన విధానాన్ని అవలంబించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెంటర్‌కు వచ్చిన వారందరిచేత వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కందుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు శ్రీ చైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గుంటి రాజయ్య, శివరాత్రి ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతి రాణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor