శిథిలావస్థలో జమ్మికుంట బీసీ హాస్టల్: నూతన ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని నిర్మించాలి – సీపీఎం డిమాండ్

0
IMG-20260809-WA0016

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 09: జమ్మికుంట మండల కేంద్రంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బీసీ బాలుర వసతిగృహం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వెంటనే బాలుర హైస్కూల్ ఆవరణలో నూతన ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఈ వసతి గృహాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ హాస్టల్‌లో ఉన్న 56 మంది విద్యార్థులు ప్రతిక్షణం తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనం స్లాబు, గోడల పెచ్చులు ఊడుతున్నాయని, వర్షం నీరు రూముల్లోకి చేరుతోందని తెలిపారు. గదులకు, కిటికీలకు సరైన తలుపులు లేకపోవడంతో విద్యార్థులు తమ బట్టలనే అడ్డుగా కట్టుకుని బస చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే 56 మందికి గాను కేవలం రెండు బాత్రూమ్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మిగతా విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయాల్సి వస్తోందన్నారు.బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలక ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు. తాత్కాలిక రిపేర్లు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, మళ్లీ పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదాలు జరిగే వరకు వేచి చూడకుండా, విద్యార్థులను వెంటనే మరొక సురక్షిత భవనంలోకి తరలించాలని డిమాండ్ చేశారు. బాలుర హైస్కూల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో యుద్ధ ప్రాతిపదికన నూతన ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, కమిటీ సభ్యులు దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, కన్నం సదానందం, రావుల ఓదెలు, శ్రీనివాస్, మహేష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *