నిషేధిత మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు: ఇల్లందకుంట ఎస్ఐ కాంతికుమార్ హెచ్చరిక
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 11: మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని ఇల్లందకుంట ఎస్ఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు. ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందకుంట, బుజునూర్, సీతంపేట గ్రామాల్లోని కిరాణా షాపులు, హోటళ్లు, పాన్ షాపుల్లో నార్కోటిక్ డాగ్‌తో ప్రత్యేక, విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించినా, సేవించినా, రవాణా చేసినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రస్తుత సమాజంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువతను, సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని, వీటిని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

యువతను ఈ దురలవాట్ల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వాడకం లేదా సరఫరాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది, నార్కోటిక్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

