తెలంగాణ · August 15, 2026

ప్రభుత్వంలో ప్రతి ఖాళీనీ భర్తీ చేస్తాం: ఆరు నెలలకోసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

సంగారెడ్డి,వి90 న్యూస్,ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ సమర్థవంతంగా భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభ ప్రాంగణంలోనే ప్రజల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల మార్కెట్‌లో కూడా బియ్యం ధరలు తగ్గాయని చెప్పారు. గడిచిన కాలంలో వ్యవసాయ రంగానికే ప్రాధాన్యమిస్తూ రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని, రూ. 21 వేల కోట్లతో రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తి చేశామని వివరించారు.

మహిళా సాధికారతే ధ్యేయంగా ఇందిరమ్మ పాలన సాగుతోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఐకేపీ సంఘాలకు రూ. 60 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ, ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాలను నిరంతరం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలోనే పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు కొందరి స్వార్థ రాజకీయ ప్రచారాలను నమ్మవద్దని, ఇప్పటికే వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేసి ప్రతీ ఖాళీని నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor