తెలంగాణ · August 15, 2026

తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం: గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 15: గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించారు.

అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సవివరమైన సందేశాన్ని ఇచ్చారు.గడిచిన 32 నెలల కాలంలో తెలంగాణ రూపురేఖలు మారాయని, నిరుపేదల ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రం వికాసం వైపు పయనిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరిందని, ఇది జాతీయ సగటు కంటే దాదాపు 91 శాతం అధికమని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను దాటి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కొనియాడారు.

రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకత పెంచేలా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని, 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తూ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించామని తెలిపారు. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నడుస్తున్నాయని వివరించారు. కనీస వేతనాల సవరణ ద్వారా కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చామని, గిగ్ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సైతం అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

యువతకు ఉపాధి కల్పనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటివరకు 72 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, టీజీపీఎస్‌సి , పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా వేలాది పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోందని వెల్లడించారు. విద్యారంగంలో సాధించిన మార్పులతో కేంద్ర పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో రాష్ట్రం 28 నుంచి 18వ స్థానానికి ఎగబాకిందని పేర్కొన్నారు.

ఉస్మానియా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, కొత్తగా 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య రంగాన్ని బలోపేతం చేశామన్నారు. ఆహార కల్తీ, డ్రగ్స్ నిర్మూలనకు ‘టీజీ సేఫ్’ పేరిట ప్రత్యేక వ్యవస్థను తెస్తున్నట్లు ప్రకటించారు.స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు.

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఐటీ ఎగుమతులు రూ. 3.97 లక్షల కోట్లకు చేరుకోవడం తెలంగాణ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని చెప్పారు. మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, రైతులు, ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాన్ని ముద్దాడుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor