తెలంగాణ · August 16, 2026

ములుగులో ఐడీఓసీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా అభివృద్ధికి నిధుల వరద

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ములుగు,వి90 న్యూస్,ఆగస్టు 16: ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయాన్ని (IDOC) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని వేయి స్తంభాల గుడికి పోటీగా అభివృద్ధి చేశామని, అదే బాటలో జంపన్నవాగును నూటికి నూరు శాతం ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు.

ఈ ప్రాంత ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని, వారి ప్రధాన సమస్య అయిన సాగునీటి ఎద్దడిని తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రాంతీయ సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు విడుదల చేస్తారని వెల్లడించారు. స్థానిక మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించడంతో పాటు మల్లూరు నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.విద్య, ఉపాధి రంగాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత తమ దృష్టిని నైపుణ్యాభివృద్ధి వైపు మళ్లించాలని ముఖ్యమంత్రి సూచించారు.

పాఠశాల విద్య పూర్తయిన తర్వాత సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి ఉద్యోగావకాశాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు సాంకేతిక విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC) ఏర్పాటుతో పాటు భవిష్యత్తులో అవసరమైన అన్ని వసతుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని, ప్రజలంతా అండగా నిలిస్తే తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తంచేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor