మానవత్వం చాటిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్: నిరుపేద లింగయ్య అంత్యక్రియలు నిర్వహించి, కుటుంబానికి ఆసరా
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 19: జమ్మికుంట పట్టణంలో కనీసం ఉండటానికి ఇల్లు లేని నిరుపేద సంద లింగయ్య అకాల మరణం చెందడంతో, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) తక్షణమే స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుడి అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న ఆయన, దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చులను భరించి, ఆ కుటుంబానికి వెంటనే రూమ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ పరిధిలో అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబ సభ్యులను ఇంటి యజమానులు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. చనిపోయారనే నెపంతో వారిని చిన్నచూపు చూసి ఇళ్ల నుండి బయటకు పంపవద్దని, చుట్టుపక్కల గ్రామాల నుండి జీవనోపాధి కోసం వచ్చి అద్దెకు ఉంటున్న వారి పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతితో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మరణం అనేది ఎవరికైనా తప్పదని గుర్తు చేస్తూ, కిరాయికి ఉన్నవారిని మన ఇంటి సభ్యుల్లా చూసుకుంటూ వారి కష్టకాలంలో తోడుగా నిలవాలని ఆకాంక్షించారు.సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు స్థానిక నాయకులు కందాల తిరుపతి, కామిశెట్టి జయేందర్, మర్రి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

