తెలంగాణ · August 20, 2026

ఎల్కతుర్తి మండలంలో విజయవంతంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ప్రజల వద్దకే వెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్

హన్మకొండ/ఎల్కతుర్తి,వి90 న్యూస్,ఆగస్టు 20: ఎల్కతుర్తి మండలంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కేశవాపూర్, రామకృష్ణాపూర్, తిమ్మాపూర్, గుంటూరుపల్లి, ఆరేపల్లి, బావుపేట తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి క్షేత్రస్థాయిలోనే అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును పరిశీలించడమే కాకుండా, గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్కతుర్తి మండలంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇందులో భాగంగా కేశవాపూర్‌ను సోలార్ మోడల్ విలేజ్‌గా, రామకృష్ణాపూర్‌ను మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గుంటూరుపల్లి-కేశవాపూర్ రహదారికి రూ. 3.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలపడంతో పాటు, కేశవాపూర్‌లో 300 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపడితే గ్రామాభివృద్ధికి రూ. 10 లక్షలు ఇస్తామని రైతులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా, నీటి నిల్వలను పెంచేందుకు ‘జల సిరి’ కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన మంత్రి, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ బీసీ మహిళలకు కుట్టు మిషన్లు, ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం స్టీల్ బ్యాంకులను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా ఈ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor