కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 23: జమ్మికుంట పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంత (అంగడి) స్థలాన్ని మున్సిపల్ యంత్రాంగం కొండూరీ కాంప్లెక్స్ నుండి పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డుకు తరలించింది. ఈ నేపథ్యంలో చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కొండూరీ కాంప్లెక్స్ సమీపంలో పాఠశాలలు, ఆసుపత్రులు, బొమ్మల గుడి ప్రాంతాలు ఉండటం వల్ల వర్షకాలంలో తీవ్రంగా బురదమయమై ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో సంత స్థలాన్ని మార్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.నూతన సంత ప్రాంగణమైన పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డు నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వరకు విద్యుత్ లైటింగ్, నిరంతర పరిశుభ్రత పనులు , చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ మార్పుకు పట్టణ ప్రజలు, వ్యాపారులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.ఈ పరిశీలన కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బోళ్ళ సదానందం, కొలుగురి కిరణ్, మహేంద్రనాథ్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

