కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 25: హుజూరాబాద్ పట్టణ పరిధిలోని పలు మున్సిపల్ అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం, పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పన , అభివృద్ధి పనుల వేగవంతానికి అవసరమైన నిధుల గురించి ఆయనకు వి వివరించింది.పట్టణ ప్రగతి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీకి ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తో పాటు పాలకవర్గ ప్రతినిధులు మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ, హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులను తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, పలువురు వార్డు కౌన్సిలర్లు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

