కరీంనగర్ · June 13, 2026

ప్రధాని మోడీ స్వచ్ఛత పిలుపుతో కదిలిన బీజేపీ శ్రేణులు: జమ్మికుంట గర్ల్స్ హైస్కూల్‌లో భారీ శ్రమదానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 13: దేశాన్ని పరిశుభ్రమైన భారతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు స్వచ్ఛత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారతం” అనే సంకల్పంతో పట్టణంలోని 23వ వార్డులో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (గర్ల్స్ హై స్కూల్) ప్రాంగణంలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను, మొక్కల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలను తొలగించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల పరిసర ప్రాంతాలు, డ్రైనేజీలను శుభ్రం చేసి విద్యార్థినులకు అనుకూలమైన పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించారు. విద్యార్థినులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నాయకులు, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన పెరగడంతో పాటు క్రమశిక్షణ, బాధ్యతాయుత భావన పెంపొందుతుందని తెలిపారు.

చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలను ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం వైపు నడిపించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన విధంగా పారవేసే చర్యలు చేపట్టామని వివరించారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పాఠశాల పరిశుభ్రతను కాపాడాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను ఆదర్శవంతమైన విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నాయకులు కోరారు. పరిశుభ్రమైన పాఠశాలలు విద్యార్థుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్, బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఠాకూర్ రాజేష్, రాకేష్, యంసాని సమ్మయ్య, కోరే రవీందర్, ఉడుగుల మహేందర్, పత్తి జనార్దన్ రెడ్డి, మోడెం రాజు, శరత్‌తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor