స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో భారత రైతులకు తీవ్ర నష్టం: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మధుర స్వామినాథన్ ఆవేదన

0
IMG-20260613-WA0034

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 13: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మధుర స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన అరిబండి లక్ష్మీనారాయణ 8వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆమె ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 18 శాతంగా ఉన్నప్పటికీ, మన దేశ ఉత్పత్తులు 13 శాతం మాత్రమేనని ఆమె వివరించారు. ఇందులో కేవలం 3 శాతం ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతూ, మిగిలిన 97 శాతం దేశీయంగానే వినియోగించబడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడవని స్పష్టం చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు రైతులకు భారీ మొత్తంలో నగదు సబ్సిడీలు ఇస్తుంటే, మన దేశంలో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చే పీఎం కిసాన్ వంటి నామమాత్రపు సబ్సిడీలే లభిస్తున్నాయని, ఈ అసమాన పోటీలో భారత రైతులు తట్టుకోవడం సాధ్యం కాదని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు తమ అధిక ఉత్పాదకత కారణంగా మార్కెట్ల కోసం ఎగబడుతున్నాయని, మన మార్కెట్లను విదేశీ కార్పొరేట్లకు అప్పగిస్తే స్థానిక రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని హెచ్చరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఐసీ) తన గోడౌన్లను అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే, భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దేశంలో తీవ్ర ఆహార భద్రతా సమస్య తలెత్తుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో వ్యవసాయ రంగం వేగంగా కార్పొరేటీకరణ వైపు వెళుతోందని, ప్రస్తుతం 80 శాతం ట్రాక్టర్లు నాలుగు కంపెనీల చేతుల్లోనే ఉండగా, 67 శాతం విత్తన రంగం ప్రైవేట్ సంస్థల అధీనంలోకి వెళ్ళిందని మధుర స్వామినాథన్ తెలిపారు. వరి, గోధుమ మినహా మిగిలిన అన్ని రకాల పంటల విత్తనాలు 80 నుండి 100 శాతం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ యుద్ధాల కారణంగా పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులకు భారంగా మారాయని, రష్యా, చైనా దేశాలు ఎరువుల ఎగుమతులపై నిషేధం విధించడంతో మన దేశం తీవ్ర ఎరువుల కొరతను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. పశ్చిమాసియా దేశాలతో పోల్చితే భారతీయ రైతులకు వస్తున్న ఆదాయం చాలా తక్కువని, దీనికి తోడు తుఫాన్లు, వరదలు, కరువులు వచ్చినప్పుడు దళితులు, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. దేశంలో 50 నుండి 60 శాతం మంది ఉన్న చిన్న సన్నకారు రైతులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల మరింత అగాధంలోకి కూరుకుపోతారని, అందుకే కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనేందుకు రైతులు, సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు ఐక్యంగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సదస్సులో మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ వి. రంగారావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతినిధి డాక్టర్ లతీఫ్ పాషా, హార్టికల్చర్ యూనివర్శిటీ ప్రతినిధి డాక్టర్ వి. సురేష్, ప్రొఫెసర్ వీరభద్రరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, తీగల సాగర్, రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్, పి. జంగారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, లెల్యాల బాలకృష్ణ, ఉడత రవీందర్, కందాల ప్రమీల, పకీరమ్మ, నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు, మల్లు నాగార్జున రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, మాటూరు బాలరాజు గౌడ్, చందు నాయక్, శెట్టి వెంకన్న, వెంకట్ మావో, పి. వెంకటేష్, ఎం. శ్రీనివాస్, దుబ్బాక రామచందర్ తదితర ముఖ్య నేతలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed