కరీంనగర్ · June 13, 2026

హుజూరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా: బీఆర్ఎస్ నేతలకు వొడితల ప్రణవ్ ఘాటు కౌంటర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, జూన్ 13: బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇకపై కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అడ్డా అని ఆయన స్పష్టం చేశారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్ లో బీఎల్ఏలకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, జాబితా సవరణ ప్రక్రియల్లో కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నాయకులు సూచించారు.

హుజూరాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటమే ఇందుకు నిదర్శనమని, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ విజయకేతనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఉప ఎన్నికల తర్వాత హుజూరాబాద్ అభివృద్ధిని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని వొడితల ప్రణవ్ ఆరోపించారు. ఆనాడు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. స్వయంగా హరీష్ రావు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన నిధుల ప్రొసీడింగ్స్ కూడా వెనక్కి మళ్లాయని, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాయలో పడి హరీష్ రావు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి తట్టెడు మట్టి తీయలేదని, కేవలం పిచ్చిలేనట్టు ప్రవర్తిస్తూ ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు.

దమ్ముంటే కౌశిక్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వస్తే ఎవరి సత్తా ఏంటో ప్రజల ముందే తేల్చుకుందామని సవాల్ విసిరారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు మాయమై రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం భారీగా రుణమాఫీ చేసి చూపించిందని ప్రణవ్ పేర్కొన్నారు. వడ్ల, మక్కల కొనుగోలుపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, జమ్మికుంట మార్కెట్ లో లక్ష క్వింటాళ్లకు పైగా మక్కలను కాంగ్రెస్ ప్రభుత్వమే చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. దళిత సోదరులను కేవలం రాజకీయాల కోసమే వాడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండేళ్లపాటు అధికారంలో ఉండి కూడా దళితబంధు నిధులను పూర్తి స్థాయిలో ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకులను తిరస్కరిస్తూ, కాంగ్రెస్ అభివృద్ధిని ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు , కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor