తెలంగాణ · June 16, 2026

అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ: ఈ నెల 23 నుండి దశలవారీగా సంప్రదింపులు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 16: హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకం ‘అమరజ్యోతి’ని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులతో పాటు, ప్రత్యేకంగా ఆడియో-విజువల్ రూమ్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కే. కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగానే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కీలక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొని ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా, ఈ నెల 23వ తేదీ నుండి అమరజ్యోతి కేంద్రంగానే వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఇందులో భాగంగా విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అడ్వకేట్లు, డాక్టర్లు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించనున్నారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారుల సంక్షేమ కమిటీలు , ఇతర వర్గాలతో రాజకీయాలకు అతీతంగా విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అర్హులైన ఉద్యమకారుల గుర్తింపునకు అవసరమైన సలహాలను దశలవారీగా సేకరించనున్నారు.ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ సూచనలను స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. ఆన్‌లైన్ విధానం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఆఫ్‌లైన్ విధానంలో ఉద్యమకారులు నేరుగా తమ దరఖాస్తులు, ప్రతినిధ్యాలను సమర్పించేందుకు వీలుగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఈ విధంగా అందిన ప్రతి ఒక్క అభిప్రాయాన్ని, వివరాలను పక్కాగా నమోదు చేసి, అర్హులైన ప్రతి ఒక్క ఉద్యమకారునికి గుర్తింపు దక్కేలా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor