తెలంగాణ · June 16, 2026

వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు: విత్తనం నుంచి కొనుగోళ్ల వరకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు విత్తనాల సరఫరా మొదలుకొని పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు ఒక నిర్దిష్ట కార్యాచరణను అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వ్యవసాయ సీజన్, క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్‌డి బోధి పెవిలియన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పంట వేసినప్పటి నుంచే రైతులు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతు కమిషన్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

వచ్చే సీజన్‌ నుంచి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌర సరఫరాల శాఖ ఎండీ, ప్రణాళికా విభాగం కార్యదర్శితో కూడిన ఒక ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ విత్తనాల పంపిణీ, పంటల వివరాల నమోదు, రికార్డులు, పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలను పర్యవేక్షిస్తుంది. ఏ రైతు ఏ పంట వేశాడు, ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో సాగవుతోందనే వివరాలు క్షేత్ర స్థాయి పరిశీలనతో పక్కాగా నమోదు చేయాలని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ (కృత్రిమ మేధ) పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాలను వినియోగించుకోవాలని సూచించారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలని, అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్‌ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.సన్న వడ్లు పండించే రైతులకు బోనస్‌ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతు వేదికల్లోనే అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే పారదర్శక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్‌ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండేలా చూస్తూ, జిల్లాల్లో వీటి పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.

ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్‌ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని, యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచించిన సీఎం, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు.మరోవైపు ప్రభుత్వ సంస్థల బలోపేతంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, మార్క్‌ఫెడ్‌ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని, గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మిన పరిస్థితి ఉండగా, ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ సాధించగలిగామని గుర్తుచేశారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల దిశలో నడిపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ డైరీని కూడా మరింత బలోపేతం చేయాలని, పాడి రైతులకు సకాలంలో పాల చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor