తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త విప్లవం: బుధవారం ఆరుట్లలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0
FB_IMG_1781622384068

రంగారెడ్డి,ఆరుట్ల,వి90 న్యూస్,జూన్ 16: రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, ప్రభుత్వ విద్యను సరికొత్త దిశలో నడిపించడానికి ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS) బుధవారం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ సరికొత్త విద్యా విధానాన్ని రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అధికారికంగా ప్రారంభించనున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పాఠశాల రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక నూతన మైలురాయిగా నిలవనుంది. బుధవారం ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకోనున్న ముఖ్యమంత్రి, ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వ విద్య బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యా కమిషన్ చైర్మ‌న్ డాక్టర్ ఆకునూరి మురళి, స‌భ్యులు పీఎల్ విశ్వేశ్వ‌ర్ రావు, డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టేష్, జోష్నా శివారెడ్డిల‌ ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

ఈ పాఠశాలలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగనుంది. నాణ్యమైన చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి ఇక్కడ సమాన ప్రాధాన్యతనిస్తున్నారు. విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించారు. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ స్కూల్‌ను తీర్చిదిద్దారు.ప్రస్తుతం తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది.

మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేయగా, భవిష్యత్తులో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరుట్ల పాఠశాల వాతావరణం కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా ఉంది. విశాలమైన ప్లేగ్రౌండ్స్, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి క్రీడలకు సంబంధించిన వసతులతో పాటు ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఐదు ప్రత్యేక బస్సులను కేటాయించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు భారీగా తరలివస్తున్నారు.

ప్రైవేట్ స్కూళ్ల నుంచి సైతం విద్యార్థులు ఇక్కడికి వస్తుండటంతో ప్రస్తుతం ఈ స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,814కు చేరింది. ఇందులో ప్రీ-ప్రైమరీలో 150 మంది, ప్రైమరీలో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో వరుసగా 160, 104 మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ కారణంగా ఇప్పటికే పాఠశాల వద్ద ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ స్పందన నిదర్శనంగా నిలుస్తోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed