విజయవాడ వెస్ట్ బైపాస్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి: ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారమంటూ ప్రశంస
ఆంధ్రప్రదేశ్/విజయవాడ,వి90 న్యూస్,జూన్ 16: విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ. 2,700 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన అత్యంత పొడవైన పశ్చిమ బైపాస్ (వెస్ట్ బైపాస్) రోడ్డును కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) అధికారులు బైపాస్ నిర్మాణ విశేషాలను, రూట్ మ్యాప్‌ను కేంద్రమంత్రికి కూలంకషంగా వివరించారు.

గొల్లపూడి నుండి వచ్చే వాహనాలు కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన వంతెన మీదుగా, సీడ్ యాక్సెస్ రోడ్డును ఉపయోగించుకుని ఈ వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరుకోవచ్చని అధికారులు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి తెలియజేశారు. ఈ నూతన అంతర్గత బైపాస్ మార్గం అందుబాటులోకి రావడం వల్ల విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ రద్దీ నుండి ఎంతగానో ఉపశమనం లభిస్తుందని, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిందని వారు కొనియాడారు.

