షాద్‌నగర్ పరిధిలో భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు: ప్రధాన నిందితుడి అరెస్ట్, బంగారం మరియు ఐఫోన్ స్వాధీనం
రంగారెడ్డి,వి90 న్యూస్,జూలై 04: షాద్‌నగర్ పరిధిలో ఇటీవల జరిగిన ఒక భారీ ఇంటి దొంగతనం కేసును స్థానిక పోలీసులు అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి సుమారు 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక ఐఫోన్-17 ఎయిర్ మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి సంబంధించి మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 22 రాత్రి సమయంలో సాయిబాలాజీ టౌన్‌షిప్‌లోని యెన్నం వీరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు 18 తులాల బంగారం, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో ప్రధాన నిందితుడైన మొహమ్మద్ సోహెల్ ఖురేషి (26)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతను తన నేరాన్ని అంగీకరించాడు.విచారణలో నిందితుడు షాకింగ్ నిజాలను వెల్లడించాడు.

దొంగిలించిన ఆస్తిని తామిద్దరం పంచుకున్నామని, తన వాటాగా వచ్చిన రెండు బంగారు ఉంగరాలను విక్రయించగా వచ్చిన డబ్బులో రూ.76 వేలతో హైదరాబాద్ కోటిలోని జగదీష్ మార్కెట్‌లో ఐఫోన్-17 ఎయిర్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి మూడు తులాల బంగారు గొలుసు, 8.5 తులాల బరువున్న మూడు బంగారు నెక్లెస్‌లు, 2.5 తులాల బరువున్న ఐదు జతల బంగారు చెవిపోగులతో పాటు సదరు ఐఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మిగిలిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు జూలై 4న వస్తుండగా, షాద్‌నగర్ క్రైమ్ టీం , సీసీఎస్ ఫ్యూచర్ సిటీ పోలీసులు ఉమ్మడిగా నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించి, చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఐలు ఆర్. శ్రీకాంత్ నాయక్, శివరెడ్డిలతో పాటు హెడ్ కానిస్టేబుల్ రవీంద్ర నాయక్, కానిస్టేబుళ్లు కరుణాకర్, సంతోష్, జాకీర్, మోహన్ లాల్, రాజు, రఫీ, సీసీఎస్ సిబ్బంది ప్రవీణ్, రాజుల సేవలను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు సిబ్బంది ప్రతిభను గుర్తిస్తూ త్వరలోనే వారికి తగిన రివార్డులు అందజేస్తామని ఆయన ప్రకటించారు.

