కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 04: అర్హులైన ప్రతి ఒక్కరూ నూతన ఓటర్ ఫారాలను పూర్తి చేసి వెంటనే సంబంధిత బీఎల్ఓలకు అందించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలోని పలు పోలింగ్ బూతులలో బీఎల్ఏ-2లతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఓటరుగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, పాత ఓట్లు ఇక పని చేయవని స్పష్టం చేశారు. అధికారులు 2002 ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారని, అట్టి ఓటర్ లిస్ట్ ఆధారంగానే మనకు ఇచ్చిన ఫారాలను నింపి, ఫోటో అంటిస్తేనే కొత్త ఓటు వస్తుందని, లేదంటే ఓటు హక్కు లభించదని ప్రజలకు వివరించారు. ఈ కీలక సమాచారాన్ని ప్రజలందరూ గమనించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకై బీఎల్ఓలు, బీఎల్ఏ-2లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూ సమన్వయంతో నడుము బిగించాలని కోరారు.కొంతమంది బీఎల్ఓలు అధికార పార్టీ నాయకులను అనుసరిస్తూ ఇక్కడ లేని వారి పేరుతో దొంగ ఓట్ల నమోదుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి అక్రమాలను ముసాయిదా ఓటర్ లిస్టులో కచ్చితంగా తొలగిస్తామని, ఇందుకోసం బీజేపీ బీఎల్ఏ-2 ప్రతినిధులు అత్యంత పకడ్బందీగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దొంగ ఓట్లకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటన కార్యక్రమంలో బీజేపీ ధార్మిక సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బచ్చు శివకుమార్, బీఎల్ఏ-2 ఎదలాపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

