కరీంనగర్ · July 6, 2026

మానేరు ఇసుకను స్థానిక జమ్మికుంట ప్రజలకే అందించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్,జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 06: జమ్మికుంట పట్టణానికి తలమానికంగా ఉన్న మానేరు ఇసుకను స్థానిక ప్రజలకు, అలాగే ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు సులభంగా, తక్కువ ధరకే అందించాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు నేతృత్వంలో జరిగిన ఈ దీక్షలో పార్టీ నాయకులు ఆకుల రాజేందర్, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, టంగుటూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరతను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మానేరు వాగు నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర సుదూర పట్టణాలకు లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఉచితంగా నిర్మిస్తున్న ఇళ్లకు కూడా ఇసుకను బ్లాక్ మార్కెట్‌లో రూ. 8,000 వరకు విక్రయిస్తూ, పేద ప్రజల నుండి దాదాపు ఐదు వేల రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఇంటి నిర్మాణానికి కనీసం 20 ట్రిప్పుల ఇసుక అవసరమైతే, ట్రిప్పుకు ఐదు వేల చొప్పున దాదాపు లక్ష రూపాయలను కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో లాక్కుంటున్నారంటూ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని జమ్మికుంట పరిసర ప్రాంతాల ప్రజలకు గతంలో మాదిరిగానే వెయ్యి రూపాయల లోపు ధరకే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీజేపీ కౌన్సిలర్లు, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor