జమ్మికుంటలో శ్రీ అభయాంజనేయ స్వామికి వెండి గద తొడుగు బహుకరణ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 07: జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వీధిలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి వెండి తొడుగు బహుకరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ పీఠంపై కొలువై ఉన్న స్వామి వారి విగ్రహానికి జమ్మికుంటకు చెందిన ప్రముఖ దాతలు రంగు సంపత్ – దేవేంద్ర దంపతులు సుమారు 200 గ్రాముల బరువు కలిగిన వెండి గద తొడుగును కానుకగా సమర్పించారు.

దాదాపు 26 వేల రూపాయల విలువచేసే ఈ వెండి గద తొడుగును ఆలయ అర్చకులు హరి కృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరింపజేశారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో దాతలతో పాటు స్థానిక భక్తులు కేదారేశ్వర్, వెంకన్న, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

