పోలీసులపై దాడి చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం

0
IMG_20260707_230819

జమ్మికుంట మీడియా సమావేశంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి హెచ్చరిక

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 07: మానేరు పరివాహక ప్రాంతాల నుండి కొంతకాలంగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని, విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు తెగబడితే ఊపేక్షించేది లేదని హుజూరాబాద్ ఏసీపీ మాధవి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి మాధవి,జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్‌తో కలిసి మాట్లాడారు. కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడానికి పరివాహక ప్రాంతాల్లోని ముఖ్యమైన గ్రామాలలో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కోరపల్లి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకున్న దాడి ఘటన వివరాలను ఏసీపీ వెల్లడించారు. విలాసాగర్ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేసే క్రమంలో కోరపల్లి చెక్ పోస్ట్ దాటి ముందుకు వెళ్ళలేకపోయారు. అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి, భయభ్రాంతులకు గురి చేస్తే సులభంగా ఇసుక రవాణా చేసుకోవచ్చనే ఉద్దేశంతో వారు కావాలనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. నిందితులు పోలీసులపై దాడికి తెగబడటమే కాకుండా దోపిడీకి కూడా పాల్పడ్డారని ఏసీపీ పేర్కొన్నారు.ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులపై గతంలోనే సుమారు 7 నుండి 8 చట్టవ్యతిరేక కేసులు నమోదై ఉన్నాయని, ఇలాంటి అలవాటు పడిన నేరస్థులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా వెనుకాడబోమని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఇకపై ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed