కరీంనగర్ · July 14, 2026

ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల వలయం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఖాళీ పోస్టులను భర్తీ చేసి, విధులకు డుమ్మా కొడుతున్న మెడికల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూలై 14: ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, విధులకు సరిగ్గా హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న మెడికల్ ఆఫీసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, అక్కడ నెలకొన్న దుస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యమే ప్రధాన ఆధారమని, కానీ ఈ కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ సూపర్‌వైజర్, హెల్త్ ఎడ్యుకేటర్, ఫార్మసిస్ట్, అటెండర్, స్వీపర్ వంటి కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత, మందుల పంపిణీ సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అధికారిక పని నెపంతో ఆసుపత్రికి రాకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సొంత పనులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. పైఅధికారుల అండదండలతోనే మెడికల్ ఆఫీసర్ ఇలా వ్యవహరిస్తున్నారని, ఆయన లేని లోటును పల్లె దవాఖాన ఇన్చార్జి డాక్టర్ భర్తీ చేయాల్సి వస్తోందని పేర్కొంటూ, సదరు మెడికల్ ఆఫీసర్‌పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని జూనియర్ అసిస్టెంట్, ఇతర సిబ్బందిపై, రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న నర్సులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాసుదేవరెడ్డి తెలిపారు. బీపీ మాత్రలు, ఇన్సులిన్ వంటి అత్యవసర మందులు లేకపోవడంతో పేద రోగులు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, మందులను అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాము, తిప్పరబోయిన శ్రీకాంత్, కొత్తూరు మల్లయ్య, రావుల రమేష్, నరేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor