కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 05: జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుని, వీఓ బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ..

వీఓ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ నుండి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వరకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ, కబ్జాదారుల చెర నుంచి దానిని విడిపించి మహిళా సంఘాల భవన నిర్మాణానికి ఉపయోగపడేలా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ మౌనం వహించడం వల్ల ఆక్రమణదారులకు బలం చేకూరుతోందని, అధికారుల తీరు వల్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకే ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ సమస్యపై ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా ఆఫీసుల చుట్టూ తిప్పడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక అధికారులకు అందజేశారు. సదరు భూమిని తక్షణమే సర్వే చేయించి కబ్జాలను తొలగించాలని, వీఓ బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

