హుస్నాబాద్ బస్ స్టేషన్‌ను త్వరలోనే ఆధునికీకరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడి
సిద్దిపేట/హుస్నాబాద్, వి90 న్యూస్,జూన్ 11: హుస్నాబాద్ బస్ స్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గురువారం ముమ్మరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్‌లో ఉన్న ప్రయాణికులతో మంత్రి నేరుగా మాట్లాడి బస్సుల లభ్యత, అందుతున్న మౌలిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద ప్రభావం వల్ల బస్ స్టేషన్ ముంపునకు గురవుతున్న నేపథ్యంలో, అక్కడ చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఆర్టీసీ ఎండీకి మంత్రి పలు సూచనలు చేశారు. వర్షపు నీరు బస్ స్టాండ్ లోపల నిల్వ ఉండకుండా, బస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న నాలాను రోడ్డు వైపు ఉన్న డ్రైనేజీకి అనుసంధానం చేస్తూ అండర్ గ్రౌండ్ నాలా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అక్కడికక్కడే ఇంజినీర్లను, ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో బస్ స్టేషన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను హుస్నాబాద్ ప్రజలు తన దృష్టికి తీసుకురాగానే ఎండీ, ఉన్నతాధికారులతో కలిసి ఇక్కడికి వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. ఈ బస్ స్టేషన్ నుండి ప్రతిరోజూ దాదాపు 35 వేల మంది ప్రయాణిస్తున్నారని, ‘ఏ’ కేటగిరీలో అత్యధిక ఆదాయం కలిగిన ఈ బస్ స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, టూరిజం, ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా హుస్నాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నాలుగు జిల్లాల కేంద్రాలను కలిపే ఫోర్ లైన్ రోడ్లు ఉన్న ఈ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరుస్తామని చెప్పారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, నిధులు వృథా కాకుండా ప్రయాణికులకు శాశ్వత ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఆనంతరం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లవేళలా ఆర్టీసీని ముందుండి నడిపిస్తున్నారని కొనియాడారు. హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో ప్రధానంగా వర్షాకాలంలో నీరు నిలవడం పెద్ద సమస్యగా మారిందని, ఖాళీ స్థలంలో ఉన్న షాపుల నిర్వాహకులు సహకరిస్తే బస్ స్టేషన్‌ను మరింత ఆధునీకరిస్తామని కోరారు. ఇది కేవలం బస్ స్టాండ్ లా కాకుండా, పెద్ద షాపింగ్ మాల్ తరహాలో ఉండేలా కమర్షియల్‌గా మౌలిక సదుపాయాలతో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తరి పద్మ, స్థానిక కౌన్సిలర్లు, ఆర్టీసీ ఉన్నతాధికారులు , ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

