కరీంనగర్ · June 13, 2026

రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం, రేవంత్ రెడ్డి హిట్లర్ పాలన అంతం అవుతుంది: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 13: జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, నిరుత్సాహానికి గురికావద్దని ధైర్యం చెప్పారు. తెలంగాణ సమాజం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన కష్టాన్ని, త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని కొనియాడారు.

కేవలం ఇంకో రెండేళ్ల కాలంలోనే ప్రజల పూర్తి ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించి, తెలంగాణను మళ్లీ ప్రగతి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హిట్లర్ తరహా పాలన త్వరలోనే అంతం కావడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన, మనం కోల్పోయిన అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని రాబోయే రోజుల్లో మరోసారి ఘనంగా సాధించుకుందామని పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో తన వెంట నిలబడి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. కార్యకర్తల కష్టానికి గుర్తింపుగా నియోజకవర్గ పరిధిలోని 127 గ్రామాల్లో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వారిని గెలిపించి నాయకులుగా నిలబెట్టే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల విజయానికి కూడా తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ రద్దుకు సంబంధించిన అధికారిక లిఖితపూర్వక కాపీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాగానే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 1,001 కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు.


ఈ భారీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టీ. జీవన్ రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జి రాకేష్ రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు , గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor