కరీంనగర్ · June 16, 2026

ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం: ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సామాజిక సేవకులు కర్నె బాబురావు డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

భద్రాద్రి కొత్తగూడెం,వి90న్యూస్,జూన్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటూ చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని సామాజిక సేవకులు కర్నె బాబురావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం భద్రాచలం యూనిట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఫారూఖ్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని అనేక ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల్లో కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆరోపించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు వంటి తప్పనిసరి సౌకర్యాలు లేకుండానే బస్సులు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మరోవైపు కొందరు డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్లలో మాట్లాడటం, అనుభవం లేని వ్యక్తులను డ్రైవర్లుగా నియమించడం వల్ల ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని ఆయన హెచ్చరించారు. రేపటి తరం భవిష్యత్తు ప్రైవేట్ యాజమాన్యాల నిర్లక్ష్యానికి బలికాకూడదని, అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓవర్‌లోడ్‌కు పాల్పడే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హత కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించాలని కోరారు. అలాగే డ్రైవర్లకు ఖాకీ యూనిఫాం, చట్టబద్ధమైన వేతనాలు, అవసరమైన శిక్షణ అందించేలా రవాణా శాఖ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని కర్నె బాబురావు విజ్ఞప్తి చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor