కోర్కల్‌లో ఇసుక రీచ్‌ను ప్రారంభించిన వొడితల ప్రణవ్: చుట్టుపక్కల గ్రామాల్లో వెల్లివిరిసిన ఆనందం
కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూన్ 17: వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామ మానేరు పరివాహక ప్రాంతంలో నూతన ఇసుక రీచ్‌ను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బుధవారం రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. దశాబ్దాల కాలంగా ఉన్న స్థానిక ప్రజల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఈ నిర్ణయంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి ముందు ఆయన కోర్కల్ గ్రామంలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక సంపదను దోచుకొని దాచుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్వయం ఉపాధి కల్పిస్తూ సంపద సృష్టించి పేదలకు పంచుతోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఇసుక విషయంలో ఇష్టారీతిన వ్యవహరించి సంవత్సరానికి కేవలం రూ.400 కోట్ల ఆదాయం తీసుకొస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా సుమారు రూ.1100 కోట్ల పైచిలుకు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూరుస్తోందని స్పష్టం చేశారు.

ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సహాయంతో పాటు న్యాయం జరుగుతుందని, ఇప్పుడు అది నిరూపితమైందని ఆయన అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత ప్రజల కోరికను తాము నెరవేర్చామని, ప్రజలు ప్రభుత్వం సూచించే యాప్ విధానాలను పాటించి ఇసుకను సరఫరా చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ‘జై కాంగ్రెస్, జై ప్రణవ్’ అంటూ నినాదాలు చేయడంతో ఇసుక ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో కోర్కల్ గ్రామ సర్పంచ్, ఇసుక రీచ్ అధికారి, వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు , స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

