తెలంగాణ · June 17, 2026

కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి/షాద్‌నగర్,వి90 న్యూస్,జూన్ 17: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్‌లో స్థానిక మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటరు సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) అవగాహన శిబిరం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పాలమూరు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సమగ్ర సర్వే ప్రక్రియపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తల ఓట్లు జాబితాలో సక్రమంగా ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ అంశంపై పార్టీ తరఫున త్వరలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై స్పందిస్తూ, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడి తెచ్చిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిందని గుర్తుచేశారు.పాలమూరు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కొనియాడారు. ప్రజల సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కార్యక్రమ నిర్వాహకులు, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, షాద్‌నగర్ నియోజకవర్గ రూపురేఖలను మార్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని తెలిపారు. ఈ ప్రాంతానికి కీలకమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఆలోచన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని, అయితే కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఆ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని ఆరోపించారు. అనంతరం పార్టీ ఇన్‌చార్జి బైకాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటరు సమగ్ర సర్వే కార్యక్రమంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి ఓటును కాపాడాలన్నారు. ఈ అవగాహన సదస్సులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, వై. రవీందర్ యాదవ్, రాజా వరప్రసాద్, నరేందర్, ఎంఎస్ నటరాజ్, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, రాంబల్ నాయక్, లక్ష్మీనరసింహారెడ్డి, మిట్టు నాయక్, ఈట గణేష్, లక్ష్మణ్ నాయక్, వెంకట్ రెడ్డి , పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor