ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ మర్యాదపూర్వక భేటీ: కీలక రంగాల్లో భాగస్వామ్యంపై విస్తృత చర్చ

0
FB_IMG_1783526032587

మూసీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీల్లో కెనడా పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి విస్తృత అవకాశాలు

హైదరాబాద్‌లో కెనడియన్ మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 08: భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. కెనడా – తెలంగాణ మధ్య వేగంగా విస్తరిస్తున్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక రంగాల్లో పరస్పర సహకరించుకునే అవకాశాలపై ఇరుపక్షాలు మాట్లాడాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా రంగాల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు రావాల్సిందిగా క్రిస్ కూటర్ ఆహ్వానించారు.సమావేశంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ వంటి మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ ప్రాజెక్టుల్లో కెనడా సాంకేతిక నైపుణ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యానికి విశేష అవకాశాలు ఉన్నాయని హై కమిషనర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కెనడియన్ సంస్థలకు పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా, ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, సీఐబీసీ (CIBC) తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించడం, అలాగే CPP Investments హైదరాబాద్‌కు చెందిన CtrlS Datacenters తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉండడం వంటి సానుకూల పరిణామాలను కూటర్ ప్రస్తావించారు.సమాచార సాంకేతికత, జీవ విజ్ఞాన శాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్-500 కంపెనీల గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంగా కాకుండా, నదీ తీర ప్రాంతాన్ని సుస్థిర ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే సమగ్ర ప్రణాళికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లక్ష్యాల సాధనలో కెనడా సహకారాన్ని కోరారు. అలాగే తెలంగాణను ప్రపంచ స్థాయి విజ్ఞాన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అనేక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నందున, కెనడాకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు కలిసి హైదరాబాద్‌లో ఒక మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. అటు తెలంగాణలో కెనడా భాగస్వామ్యం మరింత విస్తరించడానికి వీలుగా డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో ఎడిషన్లో కెనడియన్ కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలు, ఆవిష్కరణ భాగస్వాములు పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు.ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై హై కమిషనర్ క్రిస్ కూటర్ సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న దూరదృష్టితో కూడిన అభివృద్ధి విధానాలను, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని, ఉపాధి కల్పనపై చూపుతున్న ప్రత్యేక దృష్టిని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రానున్న నెలల్లో కెనడియన్ వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణను సందర్శించి ఇంధనం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, ఐటీఈ&సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed