అంతర్జాతీయం · July 13, 2026

ఆసియా U-23 అథ్లెటిక్స్ రిలేలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 13: చైనాలోని ఒర్డోస్‌ వేదికగా జరిగిన తొలి ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026 లో మహిళల 4×400 మీటర్ల రిలే పరుగుపందెంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తెలంగాణ బిడ్డ ప్రవల్లిక నరిమళ్లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అసమాన ప్రతిభ కనబరిచి దేశ ప్రతిష్టను పెంచిన ప్రవల్లిక, యువ క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు.నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో విద్యనభ్యసిస్తూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో కఠోర శిక్షణ పొందిన ప్రవల్లిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓ తాపీ మేస్త్రీ కూతురైనప్పటికీ, అకుంఠిత పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆమె నిరూపించిందని కొనియాడారు.

అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ముందే ఆమె వివిధ క్రీడా వేదికల్లో 23 స్వర్ణాలతో సహా మొత్తం 35 రాష్ట్ర స్థాయి పతకాలను సాధించి అద్భుతమైన దేశీయ రికార్డును నెలకొల్పడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కూడిన నలుగురు సభ్యుల భారత రిలే బృందం కేవలం 3:33.62 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో బలమైన ఆతిథ్య దేశమైన చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో సహా 16 పతకాలను సాధించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన భారత క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రవల్లికను అంతర్జాతీయ ఛాంపియన్‌గా తీర్చిదిద్దిన కోచ్‌లను, ఆమెకు అండగా నిలిచిన గురుకుల అకాడమీ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor