రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులదే కీలక పాత్ర: సీఎం రేవంత్ రెడ్డి
వనపర్తి,వి90 న్యూస్,జూలై 15: వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించి, అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. ఒకప్పుడు పలుగు, పార పట్టిన చేతులే నేడు కలాలు పట్టి తెలంగాణ రాతను మార్చాలని ఆకాంక్షించారు.

చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అది సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతూ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వ బడులలో కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిలతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేశారు.

రాబోయే ఆగస్టు 15వ తేదీ నాటికి దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు 9 రకాల వస్తువులతో కూడిన ‘తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లను’ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కిట్లలోని వస్తువుల నాణ్యత ఎలా ఉందో విద్యార్థులు నేరుగా వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.వ్యవస్థలో మార్పులు రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంటూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించినట్లు సీఎం తెలిపారు.

గత 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లు, పదేళ్లుగా నిలిచిపోయిన బదిలీలను విజయవంతంగా పూర్తి చేశామని, జీవో 317ను అమలు చేసి విడిపోయిన ఉపాధ్యాయ కుటుంబాలను ఒకచోటి చేర్చామని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల కష్టానికి ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 36వ స్థానం నుండి 18వ స్థానానికి ఎగబాకిందని, అయితే మొదటి రెండు స్థానాల్లో నిలిచేవరకు నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. అలాగే, ఉపాధ్యాయులకు ప్రోత్సాహకంగా ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అవార్డులు ఇస్తామని, విదేశీ విద్యా విధానాల అధ్యయనం కోసం ఈ ఏడాది 50 మంది టీచర్లను పంపించామని, వచ్చే ఏడాది ఆ సంఖ్యను 150కి పెంచుతామని వెల్లడించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త విద్యావిధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, యువతలో నైపుణ్యాలను పెంపొందించి బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థులు జర్మన్, జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలను నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అవకాశాలను అందుకోవాలని సూచించారు.

ప్రభుత్వ బడుల నుంచే రేపటి వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తయారుకావాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, మైదానాల్లో రాణించే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏడాదికి సగటున రూ. 1.08 లక్షలు ఖర్చు చేస్తోందని, ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నప్పుడు విద్యార్థులు తప్పకుండా బాగా చదువుకుని తమను తాము నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

