ఆరోగ్యం · July 16, 2026

పెద్దంపల్లిలో ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 16: గ్రామీణ ప్రాంతాల ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామ సర్పంచ్ ఎగిత పద్మ-కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలోని పాఠశాల ఆవరణలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో, జమ్మికుంట ఆదిత్య-అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంయుక్త సహకారంతో గురువారం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సర్పంచ్ పద్మ-కుమార్ మాట్లాడుతూ..

వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, 55 వేల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేసిన ఆదిత్య-అమృత ఆస్పత్రుల యాజమాన్యాన్ని సర్పంచ్ అభినందిస్తూ.. వైద్యులను ఘనంగా సత్కరించారు.ఈ శిబిరంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు భరత్, శ్రీనివాస్, మహిపాల్ మాట్లాడుతూ.. ప్రజలు సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలని, తెల్లటి ఉత్పత్తులైన బియ్యం, రవ్వ, మైదా పిండి, చక్కెర వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని కోరారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం పెరిగి మధుమేహం, బీపీ, గుండె మరియు మూత్రపిండాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ.. ప్రతి మహిళ చైతన్యవంతురాలై వంటిల్లును ఒక వైద్యశాలగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో 14 సెంటర్ల పరిధిలోని 180 గ్రామాలలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన మందులను దాతల సహకారంతో ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు.ఈ సేవా కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ ఆసియా, గ్రామ ఉపసర్పంచ్ దొడ్డే నాగరాజు, వార్డు సభ్యులు ఎం. రాజయ్య, డి. ప్రవళిక, డి. తిరుమల, ఎం. రాజేష్, డి. లావణ్య, కె. గణపతి రెడ్డి, పి. అఖిల, బాలవికాస విలేజ్ లీడర్ పి. రమ పాల్గొన్నారు. అలాగే ఆదిత్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రఫిక్, దుర్గాప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది అనిల్ రావు, మహేష్, శ్రావణ్, సంతోషిని, పూజ, శ్రావ్య, సుమలతలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor