తెలంగాణ · July 25, 2026

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్: త్వరలో అందుబాటులోకి నూతన రైల్వే స్టేషన్!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 25: తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మనోహరాబాద్-సిద్దిపేట కొత్త రైల్వే మార్గంలో భాగంగా సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జూలై 26 న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు హాజరుకానున్నారు.భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు నిర్మించిన ఈ ఆధునిక స్టేషన్‌లో హైలెవెల్ ప్లాట్‌ఫామ్‌లు, షెల్టర్లు, విశ్రాంతి గదులు, తాగునీరు మరియు విద్యుత్ లాంటి అన్ని ప్రాథమిక వసతులను కల్పించారు. ప్రస్తుతం సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య నడుస్తున్న నాలుగు డెమూ రైళ్లకు ఇక్కడ అదనపు స్టాపేజ్ కేటాయించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేట-సికింద్రాబాద్ డెమూ రైలును కొమురవెల్లి స్టేషన్ నుంచి ప్రముఖులు జెండా ఊపి ప్రారంభించనున్నారు.ప్రతి ఏటా మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతరల సమయంలో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇప్పటివరకు కేవలం రోడ్డు మార్గంపైనే ఆధారపడేవారు. ఇప్పుడు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో భక్తులకు ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా హైదరాబాద్ మహానగరంతో అనుసంధానం మరింత బలపడనుంది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor