హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతిపత్రం
కరీంనగర్,వి90 న్యూస్,జూలై 28: హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దళితుల ఆర్థిక స్వావలంబన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా గతంలో వేలాది కుటుంబాలు స్వయం ఉపాధి పొంది గౌరవంగా నిలదొక్కుకున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత బంధు రెండో విడతను నిలిపివేయడం వల్ల అర్హులైన వేలాది లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు. తక్షణమే దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేసి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.అలాగే పంటలు ఎండిపోకుండా రైతులను కాపాడేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్ మానేరు ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, కాల్వల మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని కోరారు. ఇసుక లారీల రాకపోకల వల్ల హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లోని ప్రధాన రహదారులు దెబ్బతిని గుంతలమయంగా మారాయని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఆయా మండలాల పరిధిలో రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

