తెలంగాణ · July 30, 2026

వరద నీటి నిర్వహణలో కాంగ్రెస్ విఫలం: జూరాల వరదను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 30: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకుడు రామూర్తి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నప్పటికీ, ఆ నీటిని నిల్వ చేసి సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఉపయోగించుకుని బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, సంగంబండ తదితర రిజర్వాయర్లను నింపేందుకు ఎత్తిపోతల పథకాల పంపులను పూర్తిస్థాయిలో నడిపించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు.ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రతిరోజూ 45 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారని, అదే సమయంలో స్థానిక రిజర్వాయర్లను నింపే చర్యలు వేగవంతం చేయడం లేదని వారు మండిపడ్డారు. అధికారులు సైతం తాగునీటి అవసరాలకే నీరు ఇస్తామని, వ్యవసాయానికి ఇవ్వలేమని వ్యాఖ్యానిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా రైతాంగాన్ని కాపాడుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్ని ఎత్తిపోతల పథకాల పంపులను ప్రారంభించి వరద నీటిని నిల్వ చేయాలని, లేని పక్షంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor