తెలంగాణ · July 31, 2026

తెలంగాణను ముంచెత్తిన వానలు: 12 జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాగుల ఉధృతికి ఇద్దరు బలి, స్తంభించిన జనజీవనం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 30: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో పలు జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణలోని మొత్తం 621 మండలాలకు గాను 587 మండలాల్లో వర్షం పడగా, 30 మండలాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల ధాటికి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పింఛన్ డబ్బుల కోసం వెళ్లి బల్లివాగు దాటుతున్న పారుబాయి అనే మహిళ వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా, మేడారం జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరిస్తూ తిమ్మయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. మంచిర్యాల జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండగా, ములుగు జిల్లా ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163పైకి వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో సందర్శనను నిలిపివేశారు. అలాగే సోన్-ధర్మారం మధ్య రహదారి దెబ్బతింది. మరోవైపు వర్షపు నీరు చేరడంతో భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు నిలిచిపోయి, కోట్ల రూపాయల విలువైన బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.హైదరాబాద్ నగరాన్ని కూడా రోజంతా ముసురువాన కప్పి ఉంచడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 20 నుంచి 40 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor