హుజూరాబాద్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 03: హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని విలాసాగర్, వావిలాల, గండ్రపల్లి గ్రామాల్లో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా రక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా గ్రామాల్లో సంచరిస్తున్న పలు వాహనాలను నిశితంగా పరిశీలించారు. అందులో సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాహనదారులకు చలాన్లు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన రికార్డులను తమ వెంట ఉంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అదేవిధంగా విలాసాగర్, వావిలాల పరిసర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన అక్రమ ఇసుకను పోలీసులు గుర్తించారు.

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుందని ఏసీపీ మాధవి స్పష్టం చేశారు. సంధిగ్ధ పరిస్థితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

