ప్రభుత్వ పాఠశాలలకు మెయింటెనెన్స్ బడ్జెట్ పెంచాలి: సీపీఎం డిమాండ్

0
IMG-20260804-WA0016

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 04: సీపీఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలోని బాలుర, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సీపీఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, టౌన్ కార్యదర్శి దండిగారి సతీష్ మాట్లాడుతూ, పేద , మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట బాలికల పాఠశాలలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుల ఖాళీల వల్ల బోధన దెబ్బతింటోందని, అటెండర్లు లేకపోవడంతో ఉపాధ్యాయుల సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసినప్పుడు పాఠశాల మైదానంలో నీరు నిలిచి విద్యార్థులు ఆటకు దూరమవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ‘మన ఊరు – మన బడి’ కింద చేపట్టిన టాయిలెట్ల నిర్మాణాలు నిధులు లేక అసంపూర్తిగా మిగిలిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేగలరని కోరారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫారాలు అందలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన మెనూ ఛార్జీలు, వంట కార్మికుల వేతనాలు పెంచి, క్రమం తప్పకుండా బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు బాలుర పాఠశాలలో కంప్యూటర్ బోధనా సిబ్బంది, నాన్-టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయాలని నాయకులు కోరారు. పాఠశాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం నిర్మించాలని, పాత గదుల స్థానంలో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనంతో పాటు హాస్టల్‌ను మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వడ్లూరి కిషోర్, కన్నం సదానందం, గడ్డం శోభన్, నాయకులు తాటికంటి రంజిత్ కుమార్, తుర్పాటి నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *