ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు: వొడితల ప్రణవ్
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్ ఆగస్టు 06: ప్రజలకు ఉపయోగపడే సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కులను వేగంగా అందజేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రతి గడపకు సంక్షేమాన్ని, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలను చేరవేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం రోజున ఇల్లందకుంట మండల పరిధిలోని ఇల్లందకుంట, చిన్న కోమటిపల్లి, టేకుర్తి, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి, శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా దాదాపు ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే 24 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి అందజేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించినట్లు చెప్పారు.

ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని ఉద్ఘాటించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి గృహప్రవేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ ఛైర్మన్ రామారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, జిల్లా అధికార ప్రతినిధులు, వివిధ సంస్థల డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

