హుజూరాబాద్ మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష

0
FB_IMG_1786027640958

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 06: హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు , గ్రామ సర్పంచులతో విస్తృత స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల పనితీరుపై ఆయన శాఖల వారీగా ఆరా తీశారు.సమావేశంలో ఇసుక కొరతపై సర్పంచులు లేవనెత్తిన అంశంపై స్పందిస్తూ, ఆన్‌లైన్ వ్యవస్థలో బుకింగ్ సరిగ్గా కాకపోవడంతో మార్కెట్‌లో రూ.1,500 ఇసుకను రూ.7,500 వరకు విక్రయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్లకు ఇసుక రవాణా అనుమతులు ఇవ్వాలని ఆర్‌డీఓను కోరడమే కాకుండా, అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల వద్దనే రైతులకు యూరియా అందించాలని సమావేశంలో తీర్మానించారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించాలని, ఈ ప్రక్రియ వల్ల బ్యారేజీలకు ఇబ్బంది జరిగితే తమ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కేవలం 12 గంటలు మాత్రమే ఇస్తున్నారని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, పాఠశాలలు , అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్‌డీఓ, ఎంపీడీఓ, ఎమ్మార్వో, స్థానిక సర్పంచులు , వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *