తెలంగాణ · August 6, 2026

కమలాపూర్ మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్, ఆగస్టు 06: కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు , గ్రామ సర్పంచులతో కలిసి మండల విస్తృత స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, హార్టికల్చర్, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, విద్యుత్, రెవెన్యూ, ఉపాధి హామీ తదితర శాఖల పనితీరుపై ఆయన శాఖల వారీగా సమీక్షించారు.ఈ సమావేశంలో రైతులు, ప్రజా సమస్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా యాప్ విధానానికి స్వస్తి చెప్పి నేరుగా ఎరువుల షాపుల ద్వారానే యూరియా అందించాలని తీర్మానం చేశారు. అలాగే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమలాపూర్ మండల కేంద్రంలో కేసీఆర్ ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నిర్మించుకున్న ఇళ్ల పైనుంచి వెళ్తున్న ప్రమాదకరమైన 11KV విద్యుత్ తీగలను తక్షణమే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో నిరంతరం నాణ్యమైన తాగునీటిని సరఫరా చేయాలని, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలని సూచించారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, స్థానిక సర్పంచులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor