కరీంనగర్ · August 7, 2026

జమ్మికుంట మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరిక

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 07: జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి మండల అభివృద్ధిపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, విద్యుత్, సంక్షేమ పథకాల అమలుతీరుపై శాఖల వారీగా ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే యూరియా, డీఏపీలను నేరుగా ఎరువుల షాపుల ద్వారా అందుబాటులో ఉంచాలని, యాప్‌లు, ఇతర ఉత్పత్తుల లింకింగ్‌లను పక్కనబెట్టాలని అధికారులను ఆదేశించారు. పక్క నియోజకవర్గాల్లో ఎలాంటి ఆన్‌లైన్ నిబంధనలు లేకుండా ఇసుక తరలింపునకు అనుమతులు ఇస్తూ, హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఇసుక లభ్యత పెంచి, ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ఇబ్బంది పడకుండా స్పష్టమైన విధానాన్ని తేవాలని డిమాండ్ చేశారు.నీటిపారుదల రంగానికి సంబంధించి తెగిపోయిన తనుగుల చెక్‌డ్యామ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించడంతో పాటు, కాలువల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని, కన్నెపల్లి పంపులను ప్రారంభించి తాగు, సాగునీటి సమస్యలను తీర్చాలని సమావేశంలో తీర్మానించారు.

ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో బీపీ, షుగర్ వంటి ప్రాథమిక మందులు కూడా అందుబాటులో లేకపోవడంపై, అలాగే వైద్య అధికారులు, ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.విద్యుత్ శాఖ అధికారులు 12 గంటల విద్యుత్ ఇస్తూ 24 గంటలు ఇస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామానికి తాగునీరు సరఫరా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను పురమాయించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీడీవో, తహసిల్దార్, వివిధ శాఖల అధికారులు , సర్పంచులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor