క్రైమ్ · April 24, 2026

హైదరాబాద్‌లో భారీ కల్తీ టీ పొడి గుట్టురట్టు: 4 టన్నుల పౌడర్ సీజ్, 10 మంది అరెస్ట్!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్, ఏప్రిల్ 24 (V90 NEWS): నగరంలో టీ ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో దగుల్బాజీ దందా వెలుగులోకి వచ్చింది. కేవలం డబ్బు కోసం సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఒక ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. H-FAST (Hyderabad Food Safety and Anti-Adulteration Special Team) పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సుమారు 4 టన్నుల కల్తీ టీ పొడితో పాటు, దానికి ఉపయోగించే ప్రమాదకరమైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

వాడిన పొడికే రంగుల హంగులు..

ఈ ముఠా అనుసరిస్తున్న తీరు విచారణలో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. నగరంలోని వివిధ హోటళ్లు, టీ స్టాళ్ల నుంచి వాడి పారేసిన టీ పొడిని సేకరించి, దాన్ని ఎండబెట్టి, దానికి హానికరమైన రంగులు, కృత్రిమ వాసనలు (Artificial Flavours) కలిపి మళ్లీ ప్యాక్ చేస్తున్నారు. చూడటానికి ఇది అచ్చం నాణ్యమైన టీ పొడిలాగే కనిపించేలా రసాయనాలను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల ఆపరేషన్ – 10 మంది నిందితులు కటకటాల్లోకి

గత కొంతకాలంగా ఈ అక్రమ దందాపై నిఘా ఉంచిన పోలీసులు, పక్కా సమాచారంతో అత్యంత గోప్యంగా ‘సీక్రెట్ ఆపరేషన్’ నిర్వహించి కల్తీ తయారీ కేంద్రాలపై విరుచుకుపడ్డారు. ఈ కేసులో కల్తీ టీ పొడిని తయారు చేస్తున్న ప్రధాన నిందితులతో పాటు, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో దీన్ని కొనుగోలు చేస్తున్న కొందరు టీ షాపు యజమానులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

నిపుణుల హెచ్చరిక: కల్తీ టీతో క్యాన్సర్ ముప్పు!

ఈ కల్తీ టీ పొడి వినియోగంపై ఆహార భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీ పొడికి రంగు కోసం వాడే రసాయనాలు శరీరంలోకి చేరితే కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు టీ పొడిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకే వస్తుందని నాణ్యత లేని వస్తువులను వాడొద్దని పోలీసులు సూచిస్తున్నారు

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor