వరంగల్‌తో నాకు మరువలేని అనుబంధం: హనుమకొండ పర్యటనలో రాష్ట్ర డిజిపి సివి ఆనంద్

0
IMG-20260809-WA0015

హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 09: తన ఉద్యోగ ప్రస్థానం వరంగల్‌లోనే ప్రారంభమైందని, గతంలో ఇక్కడ ఏఎస్పీగా సేవలందించిన రోజులు ఎంతో మరువలేనివని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సివి ఆనంద్ గుర్తు చేసుకున్నారు. హనుమకొండలోని నిట్ (NIT) ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1995లో సంఘంలో తాను స్వహస్తాలతో రాసిన నోట్‌ను స్థానిక సీపీ చూపించగా ఎంతో సంతోషం కలిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేదని, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎన్నో ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. అయితే ప్రస్తుతం వరంగల్ ప్రాంతంలో నక్సలిజం పూర్తిస్థాయిలో తొలగిపోయిందని స్పష్టం చేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో తన పర్యటన కొనసాగుతుందని చెబుతూ, లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం, పునరావాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి భరోసా కల్పించేందుకు రేపు ములుగులో వారితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ‘TG WE R UP’ అనే ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించారు.ప్రస్తుతం సైబర్ నేరాలు పెద్ద ముప్పుగా మారాయని, అలాగే మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో డ్రగ్స్, సైబర్ నేరాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గత రెండు నెలల్లో నిర్వహించిన సమీక్షల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రత్యేక సంస్థను తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ వ్యవస్థ వచ్చే రోజుల్లో మరింత అందుబాటులో ఉంటుందని డిజిపి హామీ ఇచ్చారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *