నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి, ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
వరంగల్,వి90 న్యూస్,ఆగస్టు 16: రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువత సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, గత ప్రభుత్వం తెచ్చిపెట్టిన అప్పుల భారాన్ని మోస్తూనే ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. బోల్తా కొట్టిన రాష్ట్ర ప్రగతి బండిని మళ్లీ పట్టాలెక్కించామని, ఇక నుంచి దానిని వేగంగా పరుగెత్తించడమే మిగిలిందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

దాదాపు రూ. 424 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు, పూర్తయిన మరికొన్ని కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఏకంగా 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కట్టుబడి ఉందన్నారు. ఇటీవల పోలీసు నియామక ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా, అభ్యర్థుల ప్రయోజనార్థం వయో పరిమితిని కూడా సడలించినట్లు వివరించారు.

విడతల వారీగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, యువత ఎలాంటి నిరాశకు గురికాకుండా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.వరంగల్ జిల్లాకు ఉన్న చైతన్యం, ఉద్యమ చరిత్ర, పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ నేల నుంచి ప్రజా జీవితం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారని స్మరించుకున్నారు. సెప్టెంబర్ నెలలో రాష్ట్ర శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని వెల్లడిస్తూ, అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరై రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై చర్చించాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దినసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

