కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 25: జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి (దుబ్బ మల్లన్న) దేవాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా మొక్కలు నాటి ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ, “తల్లి జన్మనిస్తే చెట్టు పునర్జన్మనిస్తుంది” అనే ప్రాముఖ్యత కలిగిన సందేశాన్ని ప్రజలకు గుర్తుచేశారు.

పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా పండ్ల, పూల, అలాగే ఇతర ఉపయోగకరమైన మొక్కలను నాటాలని కోరారు. ఇంటి చుట్టూ ప్రాణవాయువును అందించే ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించడమే కాకుండా, మన కుటుంబంతో పాటు సమాజం కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించవచ్చని ఆయన తెలిపారు. నాటిన ప్రతి ఒక్క మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ హరిత కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, పలువురు కౌన్సిలర్లు, దేవాలయ చైర్మన్ ముద్దమల్ల రవి, కమిటీ సభ్యులు, సైదాబాద్ సర్పంచ్ రాజారాం పాల్గొన్నారు. వీరితో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్‌ఐ భాస్కర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఆర్‌పీలు , పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

