కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 25: హుజురాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్‌తోనే సాధ్యమని విశ్వసిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు భారీగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బీరేందర్‌తో పాటు మరో 50 మంది కార్యకర్తలు, అలాగే కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరశురాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వొడితల ప్రణవ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, పాఠశాలలు , వసతి గృహాల్లో సన్నబియ్యం సరఫరా, రైతు భరోసా, అలాగే సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమ పథకాలను చేరవేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాం, నాయకుడు కార్తీక్, సీనియర్ నాయకులు సాయిని రవి, పొనగంటి మల్లయ్యతో పాటు గూడూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

