కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 29: పట్టణంలోని విస్డం జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టిసిలు) ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్య వైఖరిని నిరసిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కళాశాల ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీతో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విస్డం కళాశాలను వేరే ప్రాంతానికి విక్రయించిన తర్వాత, ఇక్కడ ద్వితీయ సంవత్సరం చదవాల్సిన విద్యార్థులు టిసిలు ఇవ్వాలని కోరుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పదేపదే తిప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కళాశాల యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకల్లా విద్యార్థులకు టిసిలు అప్పగిస్తామని కళాశాల యాజమాన్యం తమ లెటర్ ప్యాడ్‌పై లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. నిర్ణీత సమయానికి సర్టిఫికెట్లు అందించకపోతే విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు సాయిరాం, జవ్వాజి అనిల్, నల్లగొండ హరీష్ యాదవ్, నరేంగుల శివ, సాయి, రాజు, కౌశిక్, వినయ్, బాధితులైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

